- డీసీసీ అధ్యక్షులతోపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీల (డీసీసీ) కార్యవర్గాలను ఈ నెల 8లోపు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, ఆ జాబితాను హైకమాండ్ కు పంపించాలని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. జూమ్ లో ఆదివారం డీసీసీ అధ్యక్షులతో వాళ్లిద్దరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు చేశారు.
ఈ నెల 8న గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని అన్నారు. కేంద్రం కుట్రపూరితంగా జాతీయ ఉపాధి పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంపై ఇందులో చర్చించనున్నట్లు వారు తెలిపారు.
ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి ప్రజల నిరసనను కేంద్రానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని డీసీసీ చీఫ్ లను మహేశ్ గౌడ్, మీనాక్షి కోరారు. ఈనెల 15లోగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
